Narendra Modi :చిలీ భారత్‌కు ఓ ముఖ్యమైన భాగస్వామి : మోదీ

చిలీని అంటార్కిటికాకు గేట్‌వేగా చూస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) అన్నారు. భారత పర్యటనకు విచ్చేసిన చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ (Gabriel Boric) తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆర్థిక, వాణిజ్య, సామాజిక రంగాలతో సహా వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మోదీ మాట్లాడుతూ లాటిన్ అమెరికాలో చిలీ (Chile) భారత్‌కు ఓ ముఖ్యమైన భాగస్వామి అని పేర్కొన్నారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించామని వాటిని కొనసాగించాలన్నారు. ఆయుర్వేదం, సంప్రదాయ మెడిసిన్, వ్యవసాయ ఉత్పత్తుల సహకారం ఒప్పందాలు ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ (India), చిలీల మధ్య ఎన్నో సాంస్కృతిక సారూప్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. సమకాలీన సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఇతర ప్రపంచ సంస్థలతో సంస్కరణలు అవసరమని భావిస్తున్నామని, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి పిలుపునిచ్చామని తెలిపారు.