Waqf Bill :లోక్‌సభలో వక్ఫ్ బిల్లు … ప్రవేశపెట్టిన కేంద్రం

వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకువచ్చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వారి నిరసనల నడుమ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీని పై రిజిజు చర్చ చేపట్టారు. దాదాపు 8 గంటల పాటు చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకున్నాయి. ముస్లిం (Muslim) సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ బిల్లును గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపింది. ఈ కమిటీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లును కేంద్రం నేడు లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభల్లో అధికార ఎన్డీయేకు మెజారిటీ ఉన్నందున బిల్లు ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజేపీ భావిస్తోంది.