Mamata Banerjee : ఆ చట్టాన్ని బెంగాల్‌లో అమలు చేయబోం : మమతా బెనర్జీ

వక్ఫ్ చట్టం (Waqf Act) అమలు విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. దానిని బెంగాల్‌లో అమలు చేయబోమని పునరుద్ఘాటించారు. వక్ఫ్ ( సవరణ) చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగిన నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది. వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శనివారం బెంగాల్‌లోని మల్డా(Malda), ముర్షిదాబాద్ (Murshidabad), సౌత్ 24 పరగణాలు, హుగ్లీ (Hooghly) జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి, రోడ్లను దిగ్బంధించారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేయగా హింసాత్మక పరిస్థితి నెలకొంది. దీంతో 110 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మమత స్పందించారు.