Vijay Sai Reddy: ఓటర్ల జాబితాల సవరణ పై విజయ్ సాయి రెడ్డి వైరల్ ట్వీట్..

వైసీపీ (YCP) మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy) ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా వ్యవహరించేవారు. ఆయన ట్వీట్లు రాజకీయ దుమారాలు రేపే విధంగా ఉండేవి. ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు తీవ్ర విమర్శలు చేయడం, పార్టీ వైఖరిని బలంగా ప్రస్తావించడం ఆయన ట్విట్టర్ (Twitter) హ్యాండిల్ ద్వారా జరిగేది. రోజుకు నాలుగైదు ట్వీట్లు పడేయడం ఆయనకు మామూలే. అప్పుడు ఆయన సోషల్ మీడియాను ప్రత్యేకమైన స్టైల్ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. కానీ ఎన్నికల పరాజయం తర్వాత ఆయన మెల్లగా వెనక్కి తగ్గినట్లు కనిపించారు.
వైసీపీ ఓడిపోయిన తర్వాత కొంతకాలం మీడియాకు దూరంగా ఉన్న ఆయన, ఎంపీ పదవికీ, పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. వ్యవసాయం తనకు నచ్చిన పని అని చెప్పిన ఆయన అప్పట్లో రాజకీయాలనుంచి తప్పుకున్నట్టే కనిపించారు. అప్పుడప్పుడు లిక్కర్ స్కాం (Liquor Scam) వంటి కేసుల విచారణకు హాజరయ్యే సందర్భాల్లో మీడియా ఎదుట కనిపించే ఆయన, చాలా వరకు మునుపుటి దూకుడు తగ్గించుకున్నట్లు కనిపించారు. తాజాగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణపై ఆయన చేసిన డిమాండ్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
విజయసాయిరెడ్డి తాజాగా ఎలెక్షన్ కమిషన్ (Election Commission)కు చేసిన విజ్ఞప్తి ఏమిటంటే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమాన్ని చేపట్టాలన్నది. ఇది ఎందుకు అవసరం అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన కారణం బీహార్ (Bihar) రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు. అక్కడ నేపాల్ (Nepal), బంగ్లాదేశ్ (Bangladesh), మయన్మార్ (Myanmar) దేశాలకు చెందినవారు అక్రమంగా నివాసం ఉంటున్నారు. అంతేకాదు వారికి ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, నివాస ధృవీకరణ పత్రాలు కూడా ఉండటం ఆయనను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ అక్రమ వలసదారుల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న వేళ, ఈసీ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇది ఎప్పుడో చర్చలోకి రావాల్సిన విషయం అయినప్పటికీ, ఇప్పటివరకు రాజకీయాల్లో ఉన్న కొందరు మాత్రమే దీన్ని గమనించారు. కానీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి చేసిన ఈ డిమాండ్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ డిమాండ్‌కు కేంద్రం, ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే. అయితే ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం విజయసాయిరెడ్డి మరోసారి చేస్తున్నట్లు ఇప్పుడు స్పష్టమవుతోంది. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.