Donald Trump: త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ట్రంప్ భేటీ..?

చైనాతో సంబంధాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తొలుత టారిఫ్ ల మోత మోగించిన ట్రంప్.. తర్వాత వెనక్కు తగ్గారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్ పై ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కార్.. చైనా విషయంలో మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అంతేకాదు.. దీనికి వివిధ రకాల సాకులను చూపిస్తోంది. ఎందుకంటే చైనాతో వాణిజ్య బంధం అమెరికాకు సైతం అంతే ముఖ్యమన్నది ట్రంప్ సర్కార్ భావనగా తెలుస్తోంది.
అక్టోబర్ లో దక్షిణ కొరియా వేదికగా జరిగే ఆసియా- పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) వాణిజ్య మంత్రుల సమావేశానికి ట్రంప్‌తో పాటు ఆయన పరిపాలనాధికారులు హాజరయ్యే అవకాశముంది.ఈ సమావేశంలో జిన్‌పింగ్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్-జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల ట్రంప్, జిన్‌పింగ్‌లు ఫోన్‌లో మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు, ఆయన సతీమణి మెలానియాలను చైనాలో పర్యటించాలని జిన్‌పింగ్ కోరారు. దీనికి ట్రంప్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ భేటీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ సమ్మిట్‌లో ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)తో కూడా ట్రంప్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి కిమ్ హాజరవుతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ఇటీవల ట్రంప్‌ను కలిసి.. సమ్మిట్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిమ్‌ను కలిసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లీతో ట్రంప్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘‘మేం చర్చలు జరుపుతాం. అతన్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను. సంబంధాలు మెరుగుపరుచుకుంటాం’’ అని ట్రంప్ పేర్కొన్నట్లు సమాచారం.