యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… అలాంటి వారికి జీవిత ఖైదు!

ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఎన్నో అంశాలను తెలుసుకుంటున్నాం. ఎంతో మంది నిత్యం ఆయా వేదికలను వినియోగిస్తున్నారు. దీన్ని అదునుగా తీసుకుని కొందరు కేటుగాళ్లు స్వలాభం కోసం తప్పుడు కంటెంట్‌ను ప్రచారం చేస్తుంటారు. అలాంటి వారి ఆటలు కట్టించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతనంగా సోషల్ మీడియా పాలసీని ప్రవేశపెట్టనుంది. ఈ విధానానికి యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించింది. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగం వల్ల జరిగిన నష్టాలను చట్టపరంగా పరిష్కరించేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ పాలసీ ప్రకారం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. తీవ్రతను బట్టి కనీసం మూడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. ఈ మద్యకాలంలో సోషల్ మీడియాలో నకిలీ సమాచారం వ్యాప్తి చెందుతోంది. దీని ద్వారా పలుచోట్ల ఉద్రక్త పరిస్థితులు చోటు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. దీంతో తప్పుడు సమాచార వ్యాప్తిని నివారించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.