ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ..త్వరలో

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసికి రైలు సర్వీస్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఉత్తర రైల్వేశాఖ వెల్లడించిది. భారత్‌లో ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కత్రా.. కశ్మీర్ లోయలోని బారాముల్లా నుంచి సంగల్దాన్ వరకు రైల్వే సేవలు కొనసాగుతున్నాయి. తాజాగా పూర్తయిన ఈ నిర్మాణం ప్రయాణాలకు అవస్థలు పడుతున్న ప్రజలకు సేవ అందించనుంది. ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా నిలువనుంది. ఈ బ్రిడ్జి ఇంజినీర్ల ప్రతిభకు అద్దం పడుతోంది. ఇది గర్వించదగిన క్షణం. ఈ కట్టడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది అని రియాసి డిప్యూటీ కమిషన్ విశేశ్ మహాజన్ పేర్కొన్నారు.
కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్`శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది భాగం. చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న ఘబాయ్ రైల్వే వంతెన (275 మీటర్లు ఎత్తు) పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తయి సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.