Delhi Assembly Polls: ఢిల్లీ ఎన్నికల్లో టీఎంసీ మద్దతు మాకే.. థాంక్యూ దీదీ: అరవింద్ కేజ్రీవాల్

మరికొన్ని రోజుల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Polls) అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు తాము మద్దతిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రకటించింది. ఈ విషయాన్ని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్, ఆప్ కూడా ఈ ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కూడా కాంగ్రెస్‌ను కాదని, ఆప్‌కు మద్దతివ్వడం ఆసక్తికరంగా మారింది. తమకు టీఎంసీ మద్దతు ఉందని ప్రకటించిన కేజ్రీవాల్.. సోషల్ మీడియాలో ‘థ్యాంక్యూ దీదీ’ అంటూ పోస్ట్ పెట్టడం గమనార్హం. “ఢిల్లీ ఎన్నికల్లో (Delhi Assembly Polls) ఆమ్ ఆద్మీ పార్టీకి టీఎంసీ మద్దతు ప్రకటించింది. మమతా దీదీకి నేను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ధన్యవాదాలు దీదీ” అని కేజ్రీవాల్ రాసుకొచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని మెజార్టీ పార్టీలు.. కాంగ్రెస్‌ను కాదని, ఆప్‌కే మద్దతు ప్రకటించడం గమనార్హం. సమాజ్‌వాది పార్టీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) కూడా కేజ్రీవాల్ పార్టీకే మద్దతుగా నిలిచాయి. ఇది కచ్చితంగా కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో (Delhi Assembly Polls) బలహీనపరుస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.