Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన

కృష్ణా నది (Krishna River)పై ఆల్మట్టి డ్యాం (Almatti Dam) ఎత్తును పెంచాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రతిపాదనకు కర్నాటక (Karnataka) మంత్రివర్గం సెప్టెంబర్ 16న ఆమోదం తెలిపింది. డ్యాం ఎత్తు 519 మీటర్ల నుంచి 524.2 మీటర్లకు పెంచడం ద్వారా దాని సామర్థ్యం 129.72 టీఎంసీల నుంచి 279.72 టీఎంసీలకు పెరుగుతుంది. దీనికోసం సుమారు 70 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇదే జరిగితే దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో వ్యవసాయం, తాగునీటి సరఫరాకు ముప్పు వాటిల్లుతుంది. తెలుగురాష్ట్రాల విపక్షాలైన వైసీపీ, బీఆర్ఎస్.. ప్రభుత్వాల మౌనాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
ఆల్మట్టి డ్యాం ఎత్తు వివాదం కొత్తది కాదు. 2000లలోనే ఈ డ్యాం ఎత్తు పెంపుపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత తెలిపింది. కృష్ణా ట్రిబ్యునల్ ముందు దీన్ని లేవనెత్తింది. ఇప్పటికీ ఇది ట్రిబ్యునల్ ముందు విచారణలో ఉంది. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్యాం ఎత్తును 519 మీటర్లకు పరిమితం చేశారు. అయినప్పటికీ, కర్నాటక ప్రభుత్వం ఇప్పుడు భూసేకరణతో పాటు ఎత్తు పెంపునకు అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, దిగువన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల డ్యామ్‌లు తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. కృష్ణా ఆయకట్టు ప్రాంతం నీటి ఎద్దడికి లోనవుతుందని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణకు మరణశాసనం అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారతాయని, దక్షిణ తెలంగాణ వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. 90శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, అచ్చంపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులు నిరుపయోగమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నల్లమల సింహం కాదని, ఆయన నల్లమల్ల నక్క అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హక్కులను కర్నాటక కోసం త్యాగం చేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఈ పని చేయకపోతే బీఆర్ఎస్ ఢిల్లీ వెళ్లి అడ్డుకుంటుందని కేటీఆర్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కర్నాటక మంత్రివర్గం ఆమోదం తెలిపినా చంద్రబాబు ఏమీ చేయట్లేదని, ఇది రాష్ట్రాన్ని మోసం చేయడమేనని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ఏపీ వ్యవసాయానికి, తాగునీటికి శాపంగా మారుతుందన్నారు. ట్రిబ్యునల్ ముందు ఈ అంశంపై బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో భాగంగా ఉన్నందున కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ఎంపీలను సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు.
కర్నాటక ప్రభుత్వం దిగువ రాష్ట్రాల అభ్యంతరాలను లెక్క చేయట్లేదు. తమ రాష్ట్ర వ్యవసాయ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇది రాజకీయ రూపు దాల్చింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఇది ఇబ్బందికర అంశంగా మారింది. దీన్ని ఈ రెండు ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొంటాయనేది ఆసక్తికరంగా మారింది.