Palani Swamy: తమిళనాడు ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఆయనే..? తెలుగుఓటర్లను ఆకట్టుకుంటున్న పళని స్వామి..!

తమిళనాట (Tamilnadu) ఎన్నికలు అనగానే దేశ వ్యాప్తంగా ఓ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉండే ఈ ఎన్నికల్లో ఇప్పుడు కాస్త భిన్న పరిస్థితులు కనపడుతున్నాయి. విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది అనేది పక్కన పెడితే.. ప్రతిష్టాత్మక రాజకీయ యుద్దానికి క్షేత్రంగా మారింది తమిళనాడు. అధికార డిఎంకె, విపక్ష అన్నాడిఎంకె, అటు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలు ప్రజలను మెప్పించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ తరుణంలో ఓ నేత తమిళనాట తన బలాన్ని పెంచుకునే విషయంలో రోజు రోజుకు దూకుడు ప్రదర్శిస్తూ.. తన సత్తా చాటుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసుడిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న పళని స్వామీ, తమిళ ప్రజలనే కాదు, తమిళనాట బలంగా ఉన్న తెలుగు ఓటర్లను సైతం ఆకట్టుకునే విషయంలో సక్సెస్ అవుతున్నారు. ఏపీ సరిహద్దు జిల్లాలు అయిన, రాణిపేట, తిరుపత్తూరు, వెల్లూరు, కాంచీపురం మరియు తిరువణ్ణామలై, తిరువళ్ళూరు జిల్లాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. సేవ్ తమిళనాడు సేవ్ పీపుల్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు నిర్వహించారు.
ఇటీవల జులై 17 నుంచి సెప్టెంబర్ నెల మూడవ వారం వరకు నిర్వహించిన పర్యటనలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏపీ సరిహద్దు జిల్లాల్లో కూడా పర్యటించారు. తెలుగు వారు కూడా పళని స్వామికి బ్రహ్మరధం పట్టారు. తమిళనాట తెలుగు వారిలో మాజీ ముఖ్యమంత్రి జయలలితపై విశేష అభిమానం ఉంటుంది. తమిళనాట తెలుగు భాషను కాపాడే విషయంలో జయలలిత కీలక పాత్ర పోషించారు. దీనితో అప్పటి నుంచి తెలుగు ఓటర్ లు అన్నాడిఎంకే వైపు అడుగులు వేసారు.
డిఎంకె తెలుగు వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శ సైతం వినపడుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా పళని స్వామికి కలిసి వస్తుంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీని అంతర్గత సమస్యల బయటకు లాగడమే కాకుండా పార్టీ నాయకులను ఏకతాటిపైకి తీసుకు రావడంలో కూడా పళని స్వామి సక్సెస్ అయ్యారు. అటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పళని స్వామి తీసుకున్న నిర్ణయాలు, కొనసాగించిన సంక్షేమ కార్యక్రమాలు సైతం ఆయనకు కలిసి వచ్చాయి.
ప్రస్తుత డిఎంకె ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లో ఎండగట్టే విషయంలో పళని స్వామి సక్సెస్ అయ్యారు. క్షేత్ర స్థాయి నాయకత్వాన్ని, కార్యకర్తలను సమన్వయం చేస్తూ, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసంగాల విషయంలో కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న పళని స్వామి, సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక దృష్టి సారించడంతో.. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పళని స్వామి గేమ్ చేంజర్ అంటున్నారు పరిశీలకులు.