Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై కుట్రలు..!?

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్నంలో (Vizag) డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రపంచ ప్రసిద్ధ గూగుల్ సంస్థను కోరారు. ఇందుకు గూగుల్ (Google) సుముఖత వ్యక్తం చేసింది. సుమారు 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఆసియా ఖండంలోనే అతిపెద్ద 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ (Data Centre) ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకోసం 200 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే, ఈ భూసేకరణ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించేందుకు కొంతమంది కుట్రలు పన్నుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. రైతులకు తెలియకుండా కోర్టులో తప్పుడు కేసులు దాఖలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఇండియాలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ఇక్కడ నిర్మించాలని గూగుల్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెలలోనే గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గూగుల్ ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా మరిన్ని సంస్థలు విశాఖ వచ్చేందుకు సుముఖత తెలుపుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి సంస్థలు విశాఖలో తమ కార్యాలయాలు ఓపెన్ చేసేందుకు సిద్ధమయ్యాయి. తద్వారా దక్షిణ భారతదేశంలోనే విశాఖపట్నంను ఐటీ హబ్ గా మార్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లతో పోటీపడేలా విశాఖను తీర్చిదిద్దాలని ఐటీ మంత్రి నారా లోకేష్ సూచించారు.
ఐటీ సంస్థలకు అవసరమైన భూసేకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మొదట మార్కెట్ విలువకు రెండున్నర రెట్లు అధికంగా పరిహారం అందించాలని నిర్ణయించింది. ఇక్కడ మార్కెట్ విలువ ఎకరానికి రూ.17లక్షలు ఉంది. అయితే రైతుల కోరిక మేరకు దీన్ని రూ.19.5 లక్షలకు పెంచారు. రెండున్నర రెట్లు అంటే.. దాదాపు ఎకరాకు రూ.48 లక్షలకు పైగా చెల్లించనుంది ప్రభుత్వం. ఈ ధరకు భూములిచ్చేందుకు రైతులు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అంతేకాక, భూములిచ్చిన రైతులకు 3 సెంట్ల ఇంటి స్థలం, షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని హామి ఇచ్చింది. అయితే కొంతమంది ఈ ప్రక్రియకు ఆటంకం కల్పించేలా కుట్రలు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
బుధవారం విశాఖ వెళ్లిన సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్థానిక నాయకులు, అధికారులతో చర్చించారు. రైతులకు తెలియకుండా బినామీల పేరుతో కోర్టులో 26 తప్పుడు కేసులు దాఖలు చేసినట్లు తేలింది. మొత్తం 34 మంది ఈ పని చేశారని, ఇందులో మరణించిన రైతులు కూడా ఉన్నారని గుర్తించారు. విశాఖకు పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు కొంతమంది ఇలాంటి కుట్రలకు పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అమరావతికి వ్యతిరేకంగా సింగపూర్ కు ఈమెయిల్స్ పంపిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇలాంటి కుట్రలను ఆదిలోనే అడ్డుకోవాలని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భూసేకరణను వేగవంతం చేయాలని, అడ్డంకులు సృష్టించే వారిని ఉపేక్షించవద్దని సూచించారు.
రైతుల ముసుగులో కొంతమంది వైసీపీ నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. రైతుల నుంచి బినామీల పేర్లతో భూములను కాజేసిన కొంతమంది నేతలు కేసులు వేసి లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని అంచనా వేసింది. అయితే రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తోందని, వాళ్లకు తాము అండగా నిలుస్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు. రైతులపై ప్రభుత్వం కేసులు పెడుతోందని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులతో చర్చలు జరిపాలని కోరారు.