Tejashwi Yadav: ఖర్గే, రాహుల్‌తో భేటీ అయిన తేజస్వీ యాదవ్.. నితీశ్, బీజేపీపై ఫైర్!

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) నగారా మోగడానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ, రాజకీయ సమీకరణాలు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) భేటీ అయ్యారు. ఖర్గే నివాసంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఆర్జేడీ ఎంపీలు మనోజ్ ఝా, సంజయ్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
ఎన్నికల సన్నద్ధతే ప్రధాన అజెండా
ఈ భేటీలో ప్రధానంగా బిహార్ ఎన్నికలకు (Bihar Elections) ‘మహాఘట్‌బంధన్’ (ఇండియా కూటమి) సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు లోతుగా చర్చించారు. భేటీ అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బలమైన విశ్వాసం వ్యక్తం చేశారు.
సీఎం అభ్యర్థిపై తర్వాతే నిర్ణయం – తేజస్వీ:
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav).. కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై అనవసర ఊహాగానాలకు తావివ్వవద్దని విజ్ఞప్తి చేశారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ చర్చించుకుని సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు.
నితీశ్‌పై, కేంద్రంపై విమర్శలు:
ఈ సందర్భంగా బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై, బీజేపీపై తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) విమర్శలు గుప్పించారు. “ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను బీజేపీ హైజాక్ చేసింది. కేంద్రమంత్రి అమిత్ షా నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారే తప్ప, నితీశే మళ్లీ సీఎం అవుతారని వారే ధీమాగా చెప్పలేకపోతున్నారు” అని ఎద్దేవా చేశారు. గత రెండు దశాబ్దాలుగా నితీశ్ అధికారంలో ఉన్నారని, పదేళ్లకు పైగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉందని గుర్తు చేస్తూ, అయినా బిహార్ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిందని, అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. “బిహార్ ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రం. ఇక్కడ రైతుల ఆదాయాలు అత్యల్పం, వలసలు అధికం. ఈ దుస్థితికి వారి పాలనే కారణం” అని తేజస్వీ (Tejashwi Yadav) దుయ్యబట్టారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, యువత, మహిళలు రాష్ట్రంలో మార్పును, ఇండియా కూటమి విజయాన్ని కోరుకుంటున్నారని, రాష్ట్ర సమస్యలపై అంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.