వయనాడ్ కు తమిళనాడు, కర్ణాటక సహాయం

కేరళ వయనాడ్ లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 151కు చేరింది. కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతంలో రెండో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మెప్పాడితో పాటు ఇతర ప్రాంతాల్లో కేరళ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, పోలీసులు, వాలంటీర్లు దాదాపు 600 మంది సహాయక చర్యలు చేస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతోంది. ఇక దాదాపు వెయ్యి మందిని రక్షించి, పునరావాస కేంద్రాలకు తరలించామని సైన్యం తెలిపింది.
వయనాడ్ విలయంపై కర్ణాటక ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ విపత్కర పరిస్థితుల్లో కేరళ రాష్ట్రానికి అన్ని విధాలా సాయమందిస్తామని హామీ ఇచ్చారు. కేరళ రాష్ట్రానికి తమిళనాడు ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేరళ రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. సీఎం నిధుల కింద రూ.5 కోట్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.