Stalin: గవర్నర్ “పిల్ల చేష్టలు”.. సీఎం సెన్సేషనల్ కామెంట్స్

తమిళనాడు (Tamilnadu) రాష్ట్ర అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారని గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Mk Stallin) శనివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించకూడదని గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని “పిల్లతనం”గా అభివర్ణించారు సీఎం. గవర్నర్‌గా రవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నేళ్లుగా రాష్ట్ర శాసనసభలో విచిత్రమైన దృశ్యాలు కనిపిస్తున్నాయని స్టాలిన్ ఆరోపించారు. గవర్నర్ అసెంబ్లీకి వస్తారు కానీ సభలో ప్రసంగించకుండానే తిరిగి వెళ్తారు… అందుకే అతని చర్యలు చిన్నపిల్లాడిలా ఉన్నాయన్నాను అంటూ స్టాలిన్ కామెంట్స్ చేసారు.
జనవరి 6న రవి గవర్నర్ హోదాలో ప్రసంగం చేయకుండానే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. జాతీయ గీతం ప్లే చేయకపోవడంతో తీవ్ర వేదనతో ఆయన వెళ్లిపోయారని ఓ ప్రకటనలో రాజ్ భవన్ వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం, సమావేశాలు ప్రారంభమైనప్పుడు గవర్నర్ శాసన సభలో ప్రసంగించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సెషన్ ప్రారంభానికి ముందు తమిళ గీతం (తమిళ థాయ్ వాల్తు) ఆలపించడం, గవర్నర్ ప్రసంగం అనంతరం జాతీయ గీతాన్ని ప్లే చేయడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది.
అయితే ఇదంతా తెలిసినా సరే రవి ఆ విధంగా ప్రవర్తించారని స్టాలిన్ ఆరోపించారు. ఈ సభా సాంప్రదాయాలను గౌరవించకుండా, ప్రజల మనోభావాలను గౌరవించకుండా, తమిళ గీతాన్ని అవమానించే సాహసం గవర్నర్ చేసారని… రాజకీయ ఉద్దేశ్యంతో గవర్నర్ తన పదవిని వాడుకోవడాన్ని ఈ సభ ఎన్నటికి సహించదు అని స్పష్టం చేసారు. ఇలాంటివి మళ్ళీ చూడాలి అనుకోవడం లేదన్నారు. తమిళనాడు అభివృద్ధి చెందుతోందన్న వాస్తవాన్ని గవర్నర్ జీర్ణించుకోలేకపోతున్నారని తాను భావిస్తున్నట్టు స్టాలిన్ పేర్కొన్నారు. నేను సాధారణ వ్యక్తినే కావచ్చు కానీ కోట్లాది మంది ప్రజల మనోభావాల కారణంగానే ఈ శాసనసభ ఉనికిలోకి వచ్చిందన్నారు స్టాలిన్. గవర్నర్ పై సీఎం చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్నాయి.