Supreme Court: ప్రజల హక్కులను కూడా ఈడీ పట్టించుకోవాలి: సుప్రీంకోర్టు చురకలు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సుప్రీంకోర్టు (Supreme Court) మొట్టికాయలు వేసింది. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా ఈడీ గుర్తుంచుకోవాలని హితబోధ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన నాగరిక్ అపుర్తి నిగమ్ (ఎన్‌ఏఎన్) కుంభకోణం కేసును ఢిల్లీకి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ మాట్లాడుతూ, “ఈడీకి ప్రాథమిక హక్కులు ఉన్నట్లయితే, ప్రజల హక్కుల పట్ల కూడా అదే స్థాయిలో గౌరవం ఉండాలి” అని పేర్కొంది. ఆర్టికల్ 32 ప్రకారం, వ్యక్తుల హక్కులకు అన్యాయం జరిగితే వారు న్యాయపరంగా పరిష్కారం పొందగలరని కోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన సోలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు, ఈడీ తరపున పిటిషన్‌ను వెనక్కి తీసుకునే అవకాశం కోరారు. ఈ క్రమంలోనే పిటిషన్‌ను వెనక్కు తీసుకోవడానికి అనుమతించిన సుప్రీంకోర్టు.. “ఈడీకి హక్కులు ఉన్నట్లయితే, సామాన్య ప్రజల హక్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి” అంటూ ధర్మాసనం చురకలంటించింది. కేసులో కీలక నిందితుడైన మాజీ ఐఏఎస్ అధికారికి గతంలో మంజూరైన ముందస్తు బెయిల్ దుర్వినియోగమైందని ఈడీ ఆరోపించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు హైకోర్టు న్యాయమూర్తులతో సంబంధాలు పెట్టుకున్నాయని, అందువల్ల నిందితులకు అనుకూల తీర్పులు వచ్చాయని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే కేసును ఛత్తీస్‌గఢ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును (Supreme Court) ఈడీ ఆశ్రయించింది.