ఢిల్లీ మద్యం కేసు… మనీశ్ సిసోడియాకు బెయిల్

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. సిసోదియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. ఢిల్లీ మద్యం విదానానికి సంబంధించిన కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అరెస్టయిన రెండు రోజుల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా ఆయన జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ ధర్మాసనం తీర్పు వెలువరించింది.