కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఢిల్లీ సీఎం పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 23వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ కేసు తదుపరి విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ పిటిషన్‌ను వెంటనే విచారించాలని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ 'అత్యవసర అభ్యర్థన' దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న సమయంలోనే సీబీఐ కూడా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిందని కోర్టుకు మనుసింఘ్వీ తెలియజేశారు. కేజ్రీవాల్ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉపశమనం ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.