Supreme Court: కంచ గచ్చిబౌలి భూవివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని వివాదాస్పదమైన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం బుధవారం నాడు సుప్రీంకోర్టులో (Supreme Court) హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. “చెట్లు నరికివేయడానికి ముందు, 1996లో సుప్రీంకోర్టు (Supreme Court) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మీరు అనుమతులు పొందారా లేదా? స్పష్టమైన సమాధానం ఇవ్వండి” అని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని జస్టిస్ గవాయ్ సూటిగా ప్రశ్నించారు. ఈ అనుమతులు తీసుకున్న తర్వాతనే ఆ భూముల్లోని జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు సింఘ్వి తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, దాని ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ కూడా సమర్థించారు. అయితే, అనుమతులు లేకుండా చెట్లు నరికినట్లు తేలితే, చీఫ్ సెక్రటరీతో సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కోర్టు (Supreme Court) హెచ్చరించింది. 1996 డిసెంబర్‌లోని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఏమాత్రం ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
చీఫ్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) నివేదికలో ఈ భూములు రూ. 10 వేల కోట్లకు తనఖా పెట్టినట్లు ఉందని అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్.. ఆ భూములను తనఖా పెట్టారా? లేదా విక్రయించారా? అనేది తమకు అప్రస్తుతమని తేల్చిచెప్పారు. చెట్లు నరికివేయడానికి ముందు అనుమతి ఉందా? లేదా? అనేదే ప్రధానమని ఆయన నొక్కి చెప్పారు. 2004 నుండి ఈ భూముల నేపథ్యం, కోర్టులలో ఉన్న కేసులు, చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి వంటి వివరాలను కోర్టుకు అభిషేక్ మను సింఘ్వి వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం (Supreme Court) ఈ వ్యవహారంపై ప్రస్తుత స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది.