మమ్మల్ని బెదిరిస్తున్నారు… ట్విట్టర్ ఆందోళన

కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య వివాదం మరింత ముదిరింది. తమ సంస్థలపై పోలీసులు జరిపిన సోదాలు బెదిరింపుల్లా ఉన్నాయని ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశంలో తమ ఉద్యోగుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్టు పేర్కొన్నది. ఢిల్లీ, గురుగ్రామ్‍లోని తమ సంస్థ కార్యాలయాల్లో పోలీసుల తనిఖీలు నిర్వహించిన తర్వాత ట్విట్టర్ అధికారికంగా ప్రకటన చేయడం ఇదే తొలిసారి. భారతదేశ చట్టాలకు, సమాచార పారదర్శకతకు కట్టుబడి పనిచేస్తామని ట్విట్టర్ పునరుద్ఘాటించింది. అంతర్జాతీయంగా మేం అనుసరిస్తున్న విధానాల ప్రకారమే భారత్‍లో కూడా సమాచార గోప్యత, భావవ్యక్తీకరణ స్వేచ్ఛలకు భంగం కలగకుండా సేవలందిస్తాం అని వ్యాఖ్యానించింది. కేంద్రం తెచ్చిన కొత్త ఐటీ చట్టాలపై అభ్యంతరం తెలిపింది. వీటి వల్ల భారతదేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు ఉంటుందని వ్యాఖ్యానించింది.