Delhi elections: అద్దాల మేడ చుట్టూ ఢిల్లీ పాలిటిక్స్…

అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(kejriwal) గతంలో నివసించిన బంగళా కేంద్రంగా రాజకీయ ఆరోపణలు ముమ్మరమయ్యాయి. ఆ భవంతిని కేజ్రీవాల్ శీష్‌మహల్(sheesh mahal)గా మార్చుకున్నారని, దాని ఆధునికీకరణలో అక్రమాలు జరిగాయంటూ బీజేపీ కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణల్లో నిజమెంతో తేలుస్తామంటూ ఆప్(aap) నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ కార్యకర్తలతో కలసి మీడియాను వెంటబెట్టుకుని ఆ బంగళాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోడీ అధికారిక నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రధాని నివాసం ఆధునికీకరణలో విలాసాల కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారని, వాటిని ప్రత్యక్షంగా చూపిస్తామని చెబుతూ లోపలికి వెళ్లే యత్నం చేశారు. అయితే భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు. దీన్ని నిరసిస్తూ ఆప్ నేతలు ధర్నా చేపట్టారు. దీనికి స్పందనగా బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ మథుర రోడ్డులో ముఖ్యమంత్రి ఆతిశీ(athishi) నివసిస్తున్న అధికారిక బంగళాకు మీడియాతో కలసి వెళ్లారు. ఆమెకు ఇప్పటికే ప్రభుత్వ నివాసం ఉన్నప్పటికీ, మరొక బంగళా కావాలని ఎందుకు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గతవారం.. ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని మోడీ (Narendra Modi) విమర్శలు గుప్పించారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను ప్రారంభించిన మోడీ.. ఇటీవల చోటుచేసుకున్న సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని, కానీ.. తానేమీ అద్దాల మేడ (Sheesh mahal) కట్టుకోలేదన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీని విపత్తు (AAPda)గా పేర్కొన్న మోదీ.. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
కేజ్రీవాల్ కౌంటర్..
తనపై ప్రధాని మోడీ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్.. అసలైన విపత్తు బీజేపీలోనే ఉందంటూ మూడు అంశాలను లేవనెత్తారు. ‘‘ఢిల్లీలో విపత్తు లేదు. బీజేపీలోనే ఉంది. మొదటిది.. బీజేపీక ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు. రెండోది.. ఆ పార్టీకి ఎటువంటి విజన్ లేదు. చివరగా.. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి అసలు అజెండానే లేదు’’ అని ఆప్ అధినేత పేర్కొన్నారు. అద్దాల మేడగా పేర్కొంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకూ కౌంటర్ ఇచ్చారు. రూ.వేల కోట్లతో భవనం నిర్మించుకున్న వ్యక్తి, రూ.వేల కోట్ల విలువైన విమానంలో తిరిగే వ్యక్తి, రూ.లక్షల విలువైన సూట్‌లు ధరించే వ్యక్తి నుంచి శీష్‌మహల్ ప్రస్తావన రావడం సరికాదంటూ ప్రధానిని ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.