అలాంటి వ్యక్తి హోంమంత్రిగా కొనసాగడం.. నిజంగా విచిత్రమే

దేశంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ తీవ్రంగా స్పందించారు. గతంలో ఓ కేసు వ్యవహారంలో అమిత్ షా ను సుప్రీంకోర్టు రెండేళ్ల పాటు బహిష్కరించిందంటూ కేంద్రమంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల అమిత్ షా నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. దేశంలోని అవినీతిపరులందరికీ నేనొక ముఠా నాయకుడినంటూ అసత్యాలు పలికారు. అయితే చట్టాన్ని దుర్వినియోగం చేశారంటూ ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆయనకు రెండేళ్ల పాటు గుజరాత్ నుంచి బహిష్కరించింది. అలాంటి వ్యక్తి నేడు మన దేశానికి హోమంత్రిగా కొనసాగడం నిజంగా విచిత్రంగా ఉంది. కాబట్టి మన దేశంలో ఎలాంటివారి చేతిలో ఉందో మనమంతా ఆలోచించుకోవాలి. ఇలాంటి వారు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారనడంలో సందేహం లేదు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది అంటూ శరద్ పవార్ తీవ్ర ఆరోపణలు చేశారు.