ఆ విషయంలో జోక్యం చేసుకోలేం : సుప్రీంకోర్టు

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధానికి సంబంధించిన అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇజ్రాయెల్‌కు భారత్ ఆయుధాలు, మిలటరీ పరికరాల ఎగుమతిని నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దేశ విదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడిరచింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ విధంగా ఆదేశిస్తే ఆయుధాల ఎగుమతిలో భాగమైన సంస్థలు ఒప్పందాల ఉల్లంఘించాయంటూ దావాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని, అందుకే ఆ సంస్థలను నిలువరించలేమని కోర్టు పేర్కొంది. ఇలాంటి విషయాలు విదేశాంగ విధానంపై ప్రభావం చూపుతాయనని వ్యాఖ్యానించింది. అశోక్ కుమార్ శర్మ, మరికొందరు వ్యక్తుల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిల్ వేశారు. ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే భారతీయ సంస్థల లైసెన్సు రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని అందులో పేర్కొన్నారు.