S Jaishankar: ట్రంప్ బెదిరింపుల వేళ.. టారిఫ్‌లు, ఆంక్షలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) టారిఫ్‌లు, ఆంక్షల విధింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ఆ నిర్ణయాలు వాస్తవమేనని స్పష్టం చేశారు. శక్తిమంతమైన దేశంగా ఎదగాలంటే వాణిజ్య సంబంధాలు కీలకమని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్ 2025లో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై టారిఫ్‌లు, ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ విధానంలో కూడా ఇలాంటి పరిమితులు ఉంటాయా? అని అడిగిన ప్రశ్నకు జైశంకర్ (S Jaishankar) స్పందిస్తూ, ‘‘మీరు నమ్మినా, నమ్మకపోయినా.. టారిఫ్‌లు, ఆంక్షలు అనేవి ఇప్పుడు వాస్తవాలు. దేశాలు వాటిని అమలు చేస్తూనే ఉన్నాయి. గత దశాబ్దాన్ని చూస్తే ఆర్థిక ప్రవాహం, ఇంధన సరఫరా, సాంకేతికత బదిలీ పెరుగుదల వంటి అంశాలు ప్రధాన ఆయుధంగా మారాయి. ప్రపంచంలో మారుతున్న ఈ వాస్తవానికి అనుగుణంగా దేశాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. శక్తిమంతమైన దేశంగా ఎదగాలంటే వ్యాపార, వాణిజ్య సంబంధాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే దేశాలు వాటి కోసం పోటీపడుతున్నాయి,’’ అని వివరించారు.