Revanth Reddy: దక్షిణాది ప్రజలను సెకండరీ సిటిజన్లుగా చేసే ప్రయత్నం.. డీలిమిటేషన్‌పై రేవంత్ ఆగ్రహం

కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్డొన్న ఆయన.. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలను అన్యాయంగా బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందన్నారు. “తెలంగాణ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి సాధించాం. కేంద్రానికి పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నా, మాకు మాత్రం తిరిగి చాలా తక్కువ మాత్రమే వస్తోంది. రూపాయి చెల్లిస్తే 42 పైసలే మాకు తిరిగి వస్తున్నాయి. తమిళనాడుకు 26 పైసలు, కర్ణాటకకు 16 పైసలు, కేరళకు 49 పైసలు వస్తున్నాయి. కానీ బిహార్‌కు మాత్రం కేంద్రానికి చెల్లించే ప్రతి రూపాయికి ఏకంగా రూ.6.06, ఉత్తర ప్రదేశ్‌కు రూ.2.03, మధ్యప్రదేశ్‌కు రూ.1.73 వస్తున్నాయి. ఇది స్పష్టమైన వివక్ష,” అని రేవంత్ (CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
“డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది ప్రజలను సెకండరీ సిటిజన్లుగా మారుస్తున్నారు. రాజకీయపరంగా అసమానత్వాన్ని పెంచే ఈ విధానాన్ని ఏ విధంగానూ అంగీకరించకూడదు. 1976లో సీట్లు పెంచకుండా డీలిమిటేషన్ చేపట్టినట్టే, ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించాలి. ప్రధాని మోదీ దీనిపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలి,” అని రేవంత్ (CM Revanth Reddy) డిమాండ్ చేశారు.