Delhi: ఆర్ఎస్ఎస్ చీఫ్ పై రాహుల్ ఫైర్.. బీజేపీ కౌంటర్..

దేశ స్వాతంత్ర్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఫైరయ్యారు. ఆయన 1947లో స్వతంత్రం రాలేదని, దేశంలోని ప్రతీ భారతీయుడిని అవమానించారని ఆరోపించారు. అంతేకాదు.. మోహన్ భాగవత్ వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయన్నారు రాహుల్. ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా ఆర్ఎస్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకటి మా రాజ్యాంగ సిద్ధాంతం, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం. 1947లో దేశానికి స్వాతంత్ర్యం (Independence) రాలేదంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దేశ ప్రజలందరినీ అవమానించారు. బ్రిటీష్ వారిపై పోరాడిన యోధులందరినీ ఆయన కించపరిచారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయి. ఇకనైనా ఇలాంటి పిచ్చి మాటలు వినడం ఆపాలి’’ అని రాహుల్ అన్నారు.
కాంగ్రెస్ నేతలు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని ఆపగలిగేది తమ పార్టీ మాత్రమేనని అన్నారు. తమ పోరాటంలో న్యాయం ఉందని, దాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తీరుపైనా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల సమయానికి మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. దానికి సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు ఈసీ నిరాకరిస్తోంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం ఈసీ బాధ్యత. మన ఎన్నికల వ్యవస్థలో తీవ్రమైన సమస్యలున్నాయి’’ అని రాహుల్ ఆరోపించారు.
ప్రతిపక్షం బీజేపీతోనే కాదు.. దేశంతోనూ తమపార్టీ పోరాడుతోందని కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను పలువురు కేంద్రమంత్రులు తప్పుబట్టారు. కాంగ్రెస్ అసలురూపం ఈ వ్యాఖ్యలతో బహిర్గతమైందని బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా(nadda) వ్యాఖ్యానించారు. దేశంపై ప్రతిపక్షం పోరాడుతోందని చెబుతున్న రాహుల్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విపక్ష నేత దేశంతో పోరాడుతున్నామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఇక దాపరికం లేదు.. కాంగ్రెస్ చేదు నిజం బయటపడిందని అన్నారు నడ్డా. దేశానికి తెలిసిన విషయాన్ని చెప్పినందుకు రాహుల్‌ను అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గాంధీ, ఆయన చుట్టూ ఉన్నవారికి అర్బన్ నక్సల్స్‌తో సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. దేశం పరువు తీయాలని, కించపరచాలని, అప్రతిష్ఠపాలు చేయాలని వారు కోరుకుంటున్నారు. పదే పదే ఆయన చేస్తున్న పనులు ఈ నమ్మకానికి బలం చేకూర్చాయి. భారత్‌ను ముక్కలు చేసి, విభజించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కటీ చేశారు.. చెప్పారు’ అని ఎక్స్ వేదికగా నడ్డా మండి పడ్డారు.