Rahul Gandhi: ప్రశ్నాపత్రాల లీక్‌ల వల్ల ప్రమాదంలో 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు: రాహుల్ గాంధీ

దేశవ్యాప్తంగా వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్‌ల సమస్యపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లీక్‌ల వల్ల దేశంలోని 6 రాష్ట్రాల్లో 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. కష్టపడి చదివే విద్యార్థులు, వారి కుటుంబాలు ఒత్తిడికి గురవుతున్నాయని, వారి కష్టాలకు తగిన ఫలితాలు అందకుండా పోతున్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కలిసి పోరాడాలని ఆయన (Rahul Gandhi) పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఈ సమస్యపై స్పందించిన రాహుల్ గాంధీ (Rahul Gandhi).. “ప్రశ్నాపత్రాల లీక్‌ల వల్ల కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. వారి కుటుంబాలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి.
ఈ పరిస్థితి కష్టపడి పనిచేయడం కంటే నిజాయితీ లేకపోవడమే మంచిదనే తప్పుడు సందేశాన్ని భవిష్యత్తు తరాలకు పంపుతోంది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. నీట్ పేపర్ లీక్ వంటి సంఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇటీవలే మేము ఈ సమస్యపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశాం. ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు కూడా ఈ లీక్‌లను అడ్డుకోలేకపోతున్నాయి. ఇది వారి వైఫల్యానికి నిదర్శనం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమ విభేదాలను పక్కన పెట్టి, ఈ సమస్యపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పరీక్షలు మన పిల్లల హక్కు, వాటిని ఎలాగైనా కాపాడుకోవాలి” అని రాసుకొచ్చారు.