Rahul Gandhi: గుజరాత్ నుంచే మార్పు మొదలవుతుంది: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఓడించగలదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన.. జిల్లా స్థాయి నాయకులతో భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నైతిక స్థైర్యం క్షీణించినప్పటికీ, బీజేపీని ఓడించగలమనే విశ్వాసాన్ని ఆయన (Rahul Gandhi) వ్యక్తం చేశారు. గుజరాత్ నుంచే మార్పు మొదలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించడానికి కొత్త నాయకత్వం వస్తుందని రాహుల్ తెలిపారు. ఈ విషయంపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే, సీనియర్ నాయకులు గత కొన్ని నెలలుగా చర్చలు జరుపుతున్నారని ఆయన చెప్పారు.
“ప్రస్తుతం జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు, ఇది భావజాల పోరాటం కూడా. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఓడించగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ప్రజలకు తెలుసు” అని రాహుల్ గాంధీ అన్నారు. పార్టీలో నాయకుల మధ్య ఉన్న వర్గపోరు, స్థానిక నాయకులకు టిక్కెట్లు రాకుండా చేయడం వంటి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పార్టీలో మార్పులు తీసుకురావడం అవసరమని రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. ఇదే క్రమంలో పార్టీ నాయకత్వం ఎలా ఉండాలో కూడా రాహుల్ వివరించారు. “రెండు రకాల హీరోలు ఉంటారు. ఒకరు పోటీలకు, మరొకరు పెళ్ళిళ్లకు. కాంగ్రెస్ పార్టీ పెళ్ళి హీరోలను పోటీలకు, పోటీ హీరోలను పెళ్ళిళ్లకు పంపుతోందని చాలా మంది నాతో చెప్పారు. ఈ హీరోలను గుర్తించి ముందుగా వేరు చేయాలి. జిల్లా స్థాయిలో పార్టీని స్థానికంగా నడిపించాలి. సంస్థకు, అభ్యర్థులకు మధ్య బలమైన సంబంధాలు ఉండేలా చూడాలి” అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) వివరించారు.