Rahul Gandhi: కుంభమేళా మృతులను ప్రధాని మర్చిపోవడం బాధాకరం: రాహుల్ గాంధీ

కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారిని ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని కుంభమేళాను భారత సంస్కృతి ప్రతిబింబంగా ప్రశంసించడం మంచిదేనని, కానీ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించకపోవడం బాధాకరమని రాహుల్ అన్నారు. ‘‘కుంభమేళాకు వెళ్లిన యువతకు ఉద్యోగాలపై ప్రధానిని ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి’’ అని పార్లమెంట్ వెలుపల మీడియాతో అన్నారు. అలాగే, లోక్‌సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని రాహుల్ (Rahul Gandhi) ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రధాని తర్వాత ప్రతిపక్ష నేతకు మాట్లాడే హక్కు ఉంటుందని, అయితే ఈ కొత్త భారతదేశంలో ఆ హక్కు కాలం చెల్లిందని విమర్శించారు. వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ కూడా విపక్షాలకు గళాన్ని వినిపించే అవకాశం కరవవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. రాహుల్ గాంధీకి (Rahul Gandhi) లోక్‌సభ నియమాలు అర్థం కావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ‘‘ప్రధాని లేదా ఇతర మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఇతరులకు అనుమతి ఉండదని ఆయనకు స్పష్టంగా వివరించాం. అయినా మీడియా ముందుకు వచ్చి ఇలా అబద్ధాలు ఆడుతున్నారు’’ అని మండిపడ్డారు. లోక్‌సభలో కుంభమేళా గురించి మాట్లాడిన ప్రధాని మోదీ (PM Modi).. ఈ కుంభమేళా విజయవంతంగా జరగడం భారతదేశ శక్తిసామర్థ్యాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రపంచం భారత సంప్రదాయాలను గౌరవిస్తున్నదని, కుంభమేళా ద్వారా దేశ ఐక్యత స్పష్టంగా కనిపించిందని అన్నారు. గతేడాది శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా దేశం మొత్తం ఒక్కటిగా పులకించినట్లుగానే కుంభమేళా కూడా అందరిలో ఐక్యతను చూపించిందని ప్రధాని (PM Modi) తెలిపారు.