కోల్‌కతా డాక్టర్ హత్యాచారంపై తొలిసారి స్పందించిన రాహుల్ గాంధీ

దేశవ్యాప్తంగా కలకలం రేపిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ కీలకనేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. ఈ ఘటనలో ఆసుపత్రితో పాటు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం తీరుపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘‘మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సిన అధికారులు.. నిందితులను రక్షించే ప్రయత్నం చేయడం చూస్తుంటే ఆసుపత్రి, స్థానిక పరిపాలన యంత్రాంగంపై చాలా సందేహాలు తలెత్తుతున్నాయి’’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మెడికల్ కాలేజీ లాంటి ప్రదేశంలో వైద్యులకు భద్రత లేకపోతే.. ఇకపై తల్లిదండ్రులు వారి ఆడపిల్లలను చదువు కోసం బయటకు ఎలా పంపుతారు? నిర్భయ ఘటన తర్వాత కఠిన చట్టాలను తీసుకొచ్చినా కూడా ఇలాంటి నేరాలు ఎందుకు ఆగడం లేదు?’’ అని రాహుల్ నిలదీశారు. హత్రాస్ నుంచి ఉన్నావ్ ఘటన వరకు, కథువా నుంచి కోల్‌కతా హత్యాచారం వరకు దేశంలో నిరంతరంగా మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రతిపక్షంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ చర్చించాలని, ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.