ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో… ఓ ఆసక్తికర సన్నివేశం

ఎర్రకోటలో 78వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ వేడుకలకు హాజరయ్యారు. అధికారికంగా నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు ప్రతిపక్ష నేత హాజరుకావడం దశాబ్దకాలం తర్వాత ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ ఒలింపిక్ పతక విజేతలతో కలిసి కూర్చున్నారు. అయితే ఈ వేడుకల్లో ప్రతిపక్ష నేతకు కేటాయించిన సీటుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రోటోకాల్ ప్రకారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత, క్యాబినెట్ మంత్రులకు సమానంగా ముందు వరుసలో సీట్లు కేటాయిస్తారు. కానీ, రాహుల్‌గాంధీకి చివరి వరుసలో సీటు కేటాయించడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడంతో కాంగ్రెస్ ఎంపీలకు వెనక వరుసలో సీట్లు కేటాయించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపారు.