Priyanka Gandhi: మలయాళం నేర్చుకుంటున్న ప్రియాంక గాంధీ!

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) తాను మలయాళం (Malayalam) నేర్చుకుంటున్నట్లు వెల్లడించారు. వయనాడ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో మాజీ సీఎం ఏకే ఆంటోనీ ఆమెకు ఈ సలహా ఇచ్చినట్లు ఆమె చెప్పారు. “వయనాడ్ ప్రజలకు దగ్గరవ్వాలంటే వారి భాష నేర్చుకోవాలని ఆయన అన్నారు. అప్పటి నుంచి ఓ టీచర్‌ను పెట్టుకొని మలయాళం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కొంతవరకు మాట్లాడగలుగుతున్నాను,” అని ప్రియాంక తెలిపారు. వయనాడ్‌లోని వడక్కనాడ్ గిరిజన కాలనీలో జరిగిన సమావేశంలో ఆమె (Priyanka Gandhi) మాట్లాడారు. తన నానమ్మ, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ గిరిజన సమాజంపై అపారమైన గౌరవం కలిగి ఉండేవారని గుర్తుచేశారు. “గిరిజనులు ప్రకృతిని గౌరవించే విధానం, వారి సామరస్య జీవనం గురించి నానమ్మ తరచూ మాతో చెప్పేవారు. వారు ఇచ్చిన చిన్న బహుమతిని కూడా ఆమె ఎంతో జాగ్రత్తగా దాచుకునేవారు. ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న ఆమె నివాసాన్ని సందర్శిస్తే, అక్కడ ఆ బహుమతులు చూడొచ్చు,” అని ప్రియాంక (Priyanka Gandhi) తెలిపారు. వయనాడ్ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రహదారి సమస్యల పరిష్కారం కోసం నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి సంబంధిత మంత్రులను మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె (Priyanka Gandhi) చెప్పారు.