Priyanka Gandhi: పార్లమెంటులో చర్చలను అడ్డుకునేందుకు బీజేపీ వ్యూహాలు: ప్రియాంక గాంధీ

బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో (Parliament) చర్చలను అడ్డుకునేందుకు కావాలని వ్యూహాలు పన్నుతోందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi) ఆరోపించారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియను చిన్నచూపు చూస్తూ, చర్చలకు అవకాశమే లేకుండా చేస్తున్నారని బీజేపీ సర్కారుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గత కొన్ని సమావేశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఏదైనా విషయంపై చర్చించాలన్నా, తమ మాట వినిపించాలన్నా.. వారిని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. విపక్ష నేతలు మాట్లాడే సందర్భంలో వారిని కావాలని అడ్డుకోవడం, నిరసనలకు రెచ్చగొట్టడం పరిపాటిగా మారింది,’’ అని ప్రియాంకా (Priyanka Gandhi) చెప్పారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డ ఆమె.. ఎంపీల సాక్షిగా ప్రజాస్వామ్య విధానాలను బీజేపీ అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. చర్చలు జరగకుండా కేంద్రం బలప్రయోగం చేస్తోందని, ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పెనుముప్పుగా మారుతుందని ఆమె (Priyanka Gandhi) హెచ్చరించారు.