AAP: ఆప్ నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై కేసు నమోదుకు రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలపై కేసులు నమోదు చేయడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణంలో రూ. 1300 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై మనీష్ సిసోడియా (Manish Sisodia), సత్యేందర్ జైన్‌పై (Satyendra Jain) ఎఫ్‌ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2400 తరగతి గదుల నిర్మాణంలో అవకతవకలు ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC).. 2020 ఫిబ్రవరి 17న ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే 2022లో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ ఈ కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు జరపాలని సిఫారసు చేస్తూ ప్రధాన కార్యదర్శికి నివేదికను ఇచ్చింది. ఈ విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన మనీష్ సిసోడియా (Manish Sisodia), సత్యేందర్ జైన్‌పై (Satyendra Jain) కేసులు నమోదు చేయడానికి రాష్ట్రపతి అనుమతి ఇచ్చారు. గతంలో మద్యం కుంభకోణం కేసులో కూడా మనీష్ సిసోడియా, మనీ లాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త కేసులు మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీకి, ఈ సీనియర్ లీడర్లకు మరో పెద్ద షాక్ ఇచ్చాయనే చెప్పాలి.