Nominated Posts: రాజ్యసభకు సమర్థులు: రాజకీయ పార్టీల్లో మార్పు సాధ్యమేనా?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేయడం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ప్రఖ్యాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దేవరావ్ నికమ్ (Ujwal Nikam), సీనియర్ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సదానందన్ మాస్టర్ (Sadanandan Master), మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ సింగ్లా (Harshavardhan Singhla), చరిత్రకారిణి, విద్యావేత్త మీనాక్షి జైన్ (Meenakshi Jain) లను రాజ్యసభకు (Rajyasabha MP) నామినేట్ చేయడం ఆయా రంగాల్లో వారి అసాధారణ కృషికి గుర్తింపుగా నిలిచాయి. ఈ నియామకాలపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇది సాధారణ రాజకీయ నామినేషన్లకు భిన్నంగా ఉంది.
సాధారణంగా రాష్ట్రపతి కోటా కింద జరిగే నామినేషన్లు రాజకీయ పార్టీల ఆశయాలకు అనుగుణంగా లేదా పార్టీ అనుకూల వ్యక్తులకు పరిమితం అవుతుంటాయి. ముఖ్యంగా రాష్ట్రాల్లో గవర్నర్ నామినేట్ చేసే ఎమ్మెల్సీ స్థానాలైతే పూర్తిగా రాజకీయమయం అయిపోయాయి. అధికార పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పార్టీ నాయకులను లేదా తమకు విధేయులైన వారిని ఈ స్థానాలకు నామినేట్ చేస్తాయి. గతంలో కొంతమంది గవర్నర్లు ఇలాంటి నియామకాలను అడ్డుకున్నప్పటికీ, మళ్లీ అవే పేర్లను సిఫారసు చేసి ఆమోదించుకున్న సందర్భాలు కోకొల్లలు. ఇది పరోక్షంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో నామినేటెడ్ పదవుల లక్ష్యాన్ని నీరుగార్చింది.
అయితే, ప్రస్తుత రాజ్యసభ నామినేషన్లు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. ఇది నిస్సందేహంగా హర్షణీయం. వివిధ రంగాల్లో నిష్ణాతులైన, తటస్థులైన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, రాజ్యసభ వంటి ఉన్నత సభల గౌరవం మరింత పెరుగుతుంది. ఈ నియామకాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. సమర్థులకు, అర్హులకు, తటస్థులకు ఎంపీ, ఎమ్మెల్సీ (MLC) వంటి పదవులు కట్టబెట్టాలనే సూచనలు వెల్లువెత్తాయి. ఇవి కేవలం ఆకాంక్షలు మాత్రమేనా, లేక రాజకీయ పార్టీల్లో నిజమైన మార్పుకు నాంది పలకగలవా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సోషల్ మీడియా పెరిగిన తర్వాత, ప్రజల అభిప్రాయాలు, విమర్శలు వేగంగా విస్తరిస్తున్నాయి. సమర్థులైన వారిని నామినేట్ చేయాలనే ప్రజాభిప్రాయం రాజకీయ పార్టీలపై ఒత్తిడిని పెంచుతుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు చట్టసభల్లోకి వస్తే, వారి అనుభవం, జ్ఞానం చట్టాల రూపకల్పనలో, విధాన నిర్ణయాల్లో గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఇది పార్టీల ప్రతిష్టను కూడా పెంచుతుంది. నామినేషన్ ప్రక్రియలో మరింత పారదర్శకతను తీసుకురావడం ద్వారా, పార్టీలు కేవలం తమ అనుకూలురనే కాకుండా, అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి వస్తుంది.
రాజకీయ పార్టీలు ఈ సానుకూల పరిణామాలను గమనించి, తమ విధానాలను పునస్సమీక్షించుకోవడం అవసరం. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ప్రజా శ్రేయస్సు, వ్యవస్థల బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సమర్థులైన, నిస్వార్థ వ్యక్తులను చట్టసభలకు పంపడం ద్వారా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టడం, దేశాభివృద్ధికి దోహదపడటం సాధ్యపడుతుంది. తాజా నామినేషన్లు ఈ కోవలోకే వస్తాయి. ఇది భవిష్యత్తులో రాజకీయ పార్టీల విధానాలలో గుణాత్మక మార్పు తీసుకువస్తుందని, తద్వారా నిజమైన ప్రతిభ, నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుందని ఆశిద్దాం.