PM Modi: ఎందరో స్వాతంత్ర్య సమర యోధులను కాంగ్రెస్ విస్మరించింది: ప్రధాని మోదీ

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేకమంది స్వాతంత్ర్య సమర యోధులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విమర్శనాస్త్రాలు సంధించారు. కేరళకు చెందిన ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన చెట్టూర్ శంకరన్ నాయర్‌ను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. “డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను ఎలాగైతే కాంగ్రెస్ పక్కన పెట్టిందో, అదే విధంగా ధైర్యశాలి, గొప్ప జాతీయవాది అయిన శంకరన్ నాయర్‌ను కూడా విస్మరించింది” అని మోదీ అన్నారు. హరియాణా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని ప్రతి బిడ్డకు శంకరన్ నాయర్ గురించి తెలియాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేవలం వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ, దేశం కోసం పాటుపడిన నాయర్ వంటి వారిని విస్మరించిందని ఆయన (PM Modi) ఆరోపించారు. గతంలో బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ కూడా, కాంగ్రెస్ పార్టీ శంకరన్ నాయర్ వంటి గొప్ప వ్యక్తులను నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురాగతానికి నిరసనగా శంకరన్ నాయర్ అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక మండలికి రాజీనామా చేశారు. జలియన్ వాలాబాగ్ ఊచకోత అనంతరం బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు.