kendriya vidyalaya : కేవీ ప్రవేశాల్లో ఎంపీల కోటా పునరుద్ధరణపై కేంద్రం మరోసారి క్లారిటీ

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంటు సభ్యులకు గతంలో ఇచ్చిన కోటాను పునరుద్ధరించే అంశంపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. లోక్‌సభ (Lok Sabha) లో జేడీయూ ఎంపీ రాంప్రీత్ మండల్ (Rampreet Mandal ) అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తూ బదిలీ అయ్యే ఉద్యోగుల పిల్లల విద్యావసరాలను తీర్చేందుకు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా దేశవ్యాప్తంగా ఒకేరకమైన విద్య అందుతుంది. అయితే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఈ ప్రవేశాల్లో ఉండే ఎంపీ కోటా సహా పలు ప్రత్యేక ప్రొవిజన్లను గతంలో ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ఈ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదు అని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు ప్రత్యేక కోటాలను కేంద్రం 2022 ఏప్రిల్‌లో రద్దు చేసింది.