Atishi: గోవా, గుజరాత్ ఎన్నికల్లో ఒంటరిపోరే.. పొత్తుల్లేవ్: ఆప్ నేత ఆతిశీ

గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం ఆతిశీ (Atishi) తేల్చిచెప్పారు. కాంగ్రెస్ సహా ఏ పార్టీతోనూ ఈ ఎన్నికల్లో పొత్తుల గురించి తాము చర్చలు జరపలేదని ఆమె స్పష్టం చేశారు. ‘‘గోవా, గుజరాత్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నాం. కూటమిగా పోటీ చేయడంపై ఇప్పటివరకు ఎవరితోనూ చర్చించలేదు. 2022లో గోవాలో బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకున్నా.. ఎనిమిది మంది బీజేపీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు (Congress) ముగ్గురు ఎమ్మెల్యేలుంటే.. ఆప్ దగ్గర ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు నెలలు కూడా నిలవలేరని చాలామంది ప్రచారం చేశారు. కానీ, వాళ్లు ఇప్పటికీ ఆప్ (AAP)తోనే ఉన్నారు. రాజకీయాల్లో చేరి డబ్బు సంపాదించడానికి వాళ్లు రాలేదు. అందుకే మాతో కలిసి ఉన్నారు’’ అని ఆమె (Atishi) వివరించారు తెలిపారు.
ఢిల్లీలో ఓటమి గురించి కూడా మాట్లాడిన ఆమె..‘‘ఆప్‌కు (AAP) ఏం జరుగుతుందనేది ముఖ్యం కాదు. ప్రజలకు ఏం జరుగుతుందనేదే మాకు ముఖ్యం. బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చాక 250 మొహల్లా క్లీనిక్‌లను మూసివేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఉచిత మందులను కూడా నిలిపేస్తారట. ఆప్ కనుక ఓడిపోతే విద్యుత్ కోతలు మొదలవుతాయని.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య దురావస్థకు చేరుతుందని కేజ్రీవాల్ ఎప్పుడో హెచ్చరించారు. ఇప్పుడు పరిస్థితి అటువైపే వెళ్తోంది’’ అని ఆమె (Atishi) పేర్కొన్నారు.