Nitin Gadkari: రహదారులను అమెరికా కన్నా మెరుగ్గా తీర్చిదిద్దుతా: నితిన్ గడ్కరీ

దేశ రహదారులను అమెరికా కన్నా మెరుగ్గా తీర్చిదిద్దుతానని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు. ‘‘అమెరికా రహదారులు అద్భుతంగా ఉండటం వలన ఆ దేశం ధనికదేశంగా మారింది. అంతేకానీ ధనిక దేశం కాబట్టి వాళ్ల రోడ్లు బాగుండవు’’ అని జాన్ ఎఫ్ కెన్నడీ చేసిన వ్యాఖ్యలను గడ్కరీ గుర్తుచేశారు. భారత్‌లో రాబోయే రెండు సంవత్సరాల్లో అన్ని జాతీయ రహదారులు అత్యున్నత ప్రమాణాలతో ఉంటాయని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత రహదారుల అభివృద్ధి బాధ్యత తనపై పెట్టిందని, గత పదకొండు సంవత్సరాలలో అనేక ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, వంతెనలు, హైవేలు నిర్మించామని గడ్కరీ (Nitin Gadkari) వివరించారు. ఒకప్పుడు గుంతలతో నిండి ఉండే రోడ్లను విదేశీయులు కూడా ఎగతాళి చేసేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోందని అన్నారు. ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి చర్యల వల్ల రవాణా వేగం పెరిగిందని, వ్యాపార అభివృద్ధికి మార్గం సుగమమవుతోందని, పరిశ్రమలు ఏర్పడే అవకాశం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్డు కనెక్టివిటీ పరంగా భారత్‌ను ప్రపంచంలోనే ఆదర్శ దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని గడ్కరీ (Nitin Gadkari) స్పష్టం చేశారు.