Nitin Gadkari: ఆరు నెలల్లో పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా ఈవీ ధరలు: నితిన్ గడ్కరీ

వచ్చే ఆరు నెలల్లో దేశంలోని పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) ధరలు ఉంటాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన 32వ కన్వర్జెన్స్ ఇండియా, 10వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్‌పోలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే పనులు మూడు నెలల్లో పూర్తవుతాయని గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా మారడం వల్ల ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తి పెంపు, కాలుష్య నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తోందని చెప్పారు. భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలంటే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కీలకమని గడ్కరీ అన్నారు. నాణ్యమైన రోడ్ల నిర్మాణం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించుకోవచ్చని గడ్కరీ (Nitin Gadkari) వివరించారు. స్మార్ట్ సిటీలు, స్మార్ట్ రవాణా వంటి రంగాల్లో అభివృద్ధి చెందాలంటే నూతన సాంకేతికత, ఆవిష్కరణలు కీలకమని ఆయన పేర్కొన్నారు.