Rahul Gandhi : వారిని ఫిల్టర్ చేయాలి … రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ (BJP) కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. మన బాధ్యతలు నెరవేర్చేంత వరకు అధికారం ఇవ్వమని గుజరాత్ (Gujarat) ప్రజలను అడగకూడదని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాహుల్ ఈ విధంగా మాట్లాడారు. తమ పార్టీ బాధ్యతలు నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రజలు తమకు ఓటు వేయరని పేర్కొన్నారు.
మూడు దశాబ్దాలుగా బీజేపీ అందించిన పాలన విఫలమైందని, గుజరాత్ ప్రజలు కొత్త విజన్ కోసం వేచి చూస్తున్నారని అన్నారు. ఆశించిన విధంగా రాష్ట్రం ప్రగతి సాధించడం లేదని, కాంగ్రెస్ (Congress) కూడా అందుకు సరైన మార్గాన్ని చూపించలేకపోతోందని అభిప్రాయపడ్డారు. గుజరాత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో రెండు రకాలున్నారు. నిజాయతీగా పనిచేస్తూ ప్రజలను గౌరవిస్తూ, వారి కోసం పోరాడుతూ, పార్టీ సిద్ధాంతాన్ని తమ గుండెల్లో పెట్టుకునేవారు ఒకరు. రెండో రకానికి వస్తే, ప్రజలతో సంబంధాలు కొనసాగించకుండా వారితో దూరంగా ఉండటమే కాకుండా గౌరవం కూడా ఇవ్వరు. ఇందులో సగం మంది బీజేపీతో ఉన్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు.