NDA: 11 ఏళ్ల ఎన్డీఏ పాలన భేష్ అంటున్న కేంద్రమంత్రులు, నిపుణులు..

ఎన్డీయే (NDA) పాలనకు 11 ఏళ్లు పూర్తయింది. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా, వాతావరణ చర్యలు, డిజిటల్ ఆవిష్కరణ వంటి కీలకమైన ప్రపంచ సమస్యలపై ప్రధాన గొంతుకగా కూడా మారిన పరిస్థితులున్నాయి. గత 11 సంవత్సరాలలో రెండు దఫాలు పదవీకాలం పూర్తి కాగా, ఎన్డీఏ ప్రభుత్వం మూడో టర్మ్‌లో మొదటి సంవత్సరం పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ (Modi) మాట్లాడుతూ.. మంచి పాలనతో, పాటు, గ్లోబల్ లీడర్‌షిప్, ఆర్థిక వృద్ధి, పరివర్తనపై స్పెషల్ ఫోకస్ చేశామన్నారు.
సామాజిక న్యాయం
ప్రస్తుత కేంద్ర మంత్రులలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, OBC కేటగిరీలకు చెందినవారు ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ లాంటివి తమ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాయని మోడీ ఆరోపించారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పడానికి సగానికి పైగా కేంద్ర మంత్రులు వెనుకబడిన వర్గాలకు చెందినవారే కావడం గుర్తించ దగిన పరిణామమన్నారు మోడీ..
ప్రధాని మోదీ తన ఎక్స్ పోస్ట్ లో.. 140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులతో, అందరి భాగస్వామ్యంతో మన దేశం వివిధ రంగాలలో వేగవంతమైన మార్పులకు సాక్ష్యంగా నిలిచింది. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ అనే సూత్రాలతో నడుస్తున్న NDA ప్రభుత్వం వేగంతో పాటు సున్నితత్వంతో మార్పులు తీసుకువచ్చిందని ప్రధాని మోడీ అన్నారు.
ఆర్థిక వృద్ధి నుండి సామాజిక అభివృద్ధి వరకు, ప్రజలకు సంబంధించిన అందరినీ కలుపుకొనిపోయేతత్వంతో సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించామని ఆయన అన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ, “మా సమష్టి విజయానికి మేం గర్విస్తున్నాము. అదే సమయంలో, వికసిత్ భారత్ ను నిర్మించడానికి ఆశ, విశ్వాసం, సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. “దేశంలోని పలు రంగాలలో తీసుకువచ్చిన మార్పుల వివరాలను వెల్లడిస్తూ, “11 సంవత్సరాల సర్వీస్” అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేశారు.
అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, ‘వికాస్‌వాద్’ను ప్రధాన స్రవంతిలోకి మోడీ తీసుకువచ్చారు. ఇది రాజకీయ చర్చ, విధాన చర్యలు దీని చుట్టూ తిరుగుతున్నాయని బీజేపీ పేర్కొంది. 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, ‘ఇండియా ఫస్ట్’ తన ప్రతి విధానానికి మార్గదర్శకంగా ఉందని పేర్కొంది.
ఎన్డీయే హయాంలో దేశంలోని 81 కోట్ల మందికి పైగా ప్రజలు ఉచితంగా ఆహార ధాన్యాలు (రేషన్ బియ్యం) పొందుతున్నారు. 15 కోట్ల ఇళ్లకు పైగా నల్లా నీటి కనెక్షన్లు వచ్చాయి. అర్హులైన నిరు పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించాం. దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. 68 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చాం. స్మార్టప్స్, చిన్న వ్యవస్థాపక సంస్థలకు ఏకంగా 52.5 కోట్ల రుణాలు ఇవ్వడంతో పాటు కరోనా సమయంలో 20 కోట్ల మంది మహిళలకు పలు పథకాల ద్వారా నగదు సహాయం అందించారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.