Maharastra: పవర్ కోసం పవార్ ఫ్యామిలీ ప్రయత్నాలా…?

మహారాష్ట్ర అధికార కూటమి మహాయుతి(mahayuti)లో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత అజిత్ (Ajit Pawar) పవార్ కూటమిని వీడి మళ్లీ తన బాబాయ్ NCP (SP) అధ్యక్షుడు శరద్ పవార్‌తో (Sharad Pawar) చేతులు కలపనున్నట్లు సమాచారం. డిసెంబర్ 12న శరద్ పవార్ పుట్టిన రోజు సందర్భంగా అజిత్ పవార్ ఆయనను కలిశారు. ఢిల్లీలోని శరద్ నివాసానికి అకస్మికంగా వెళ్లారు. దీంతో అక్కడే వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. మహాయుతి కూటమిని వీడి శరద్ పవార్‌తో కలిసి పని చేసేందుకు అజిత్ సిద్ధమైనట్లు వదంతులు వస్తున్నాయి.
పవార్ కుటుంబం కలవాలి: ఎన్సీపీ
ఈ క్రమంలోనే అజిత్ పవార్ తల్లి ఆశాతై విలేకరులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవార్ కుటుంబంలోని విభేదాలు తొలగిపోయి.. తన కుమారుడు, శరద్ పవార్‌తో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘ఎన్సీపీ నుంచి విడిపోయినప్పటికీ శరద్ పవార్‌పై మాకు అమితమైన గౌరవం ఉంది. ఆయన మాకు తండ్రితో సమానం. పవార్ కుటుంబం మళ్లీ కలవాలని కోరుకుంటున్నా’’ అని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు.
వీరు చేసిన వ్యాఖ్యలు అజిత్, శరద్ పవార్లు మళ్లీ కలుస్తారనే ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. కాగా.. శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీని చీల్చి షిండే వర్గంలో చేరిన అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. త్వరలో ఆయన తన బాబాయ్‌తో కలిసిపోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే జరిగితే మళ్లీ మహారాష్ట్రలో పవార్ పాలిటిక్స్ రాజ్యమేలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. పార్టీ నుంచి వేరైనా ఇద్దరు పవార్లు గురు,శిష్యుల్లా మెసలుతారు. శరద్ పవార్ మాటంటే.. పవార్ కుటుంబానికి శిరోధార్యమని చెప్పాలి. రాజకీయ పదవులకోసం వేరు పార్టీ పెట్టినా.. తిరిగి సొంతగూటికి అజిత్ చేరుకుంటారన్న వార్త.. మహారాజకీయాల్లో చర్చనీయాంశమైంది.