National Herald Case: సోనియా, రాహుల్ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో చేర్చిన ఈడీ

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు (National Herald Case) సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణల కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలకమైన ముందడుగు వేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నిందితులుగా పేర్కొంటూ ఈడీ తొలిసారిగా ఛార్జిషీట్‌ను (ప్రాసిక్యూషన్ కంప్లయింట్) దాఖలు చేసింది. వీరితో పాటు పార్టీకి చెందిన మరో ఇద్దరు నేతలు శ్యామ్ పిట్రోడా, సుమన్ దూబేల పేర్లను కూడా ఈ ఛార్జిషీట్‌లో చేర్చారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో సమర్పించిన ఈ (National Herald Case) ఛార్జిషీట్‌పై ఏప్రిల్ 25వ తేదీన విచారణ జరగనుంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను హరియాణా రియల్ ఎస్టేట్ ఒప్పందానికి సంబంధించిన వేరొక మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవధిలోనే, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
విదేశీ నిధుల దుర్వినియోగం..
నేషనల్ హెరాల్డ్ (National Herald Case) పత్రికను నడపడానికి విదేశీ నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలపై ఈడీ, సీబీఐ గతంలో దర్యాప్తు చేపట్టాయి. సీబీఐ విచారణ నిలిచిపోయినప్పటికీ, ఈడీ మాత్రం తన దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గతంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ పలు దఫాలు విచారించింది.