జూలై 19 నుంచి పార్లమెంట్… వర్షాకాల సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. జులై 19న ప్రారంభమై ఆగస్టు 13తో ముగియనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫారసు చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా పార్లమెంట్ సమావేశాలు సరిగా కొనసాగలేదు. అత్యవసరం నిమిత్తం కొన్ని సందర్భాల్లో ప్రత్యేకం సమావేశాలను నిర్వహించారు. సుమారు నెల రోజుల పాటు సాగే సమావేశాల్లో 20 సిట్టింగ్స్ ఉండనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో కోవిడ్‍కు సంబంధించిన అన్ని ప్రోటోకాల్‍లు పాటిస్తారు. అలాగే సభ్యులంతా కనీసం ఒక డోసు కోవిడ్ టీకా తీసుకున్న వారిని పార్లమెంట్‍లోకి ఎంటరయ్యే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పార్లమెంటు మాన్‍సూన్ సెషన్ జులై మూడవ వారంలో ప్రారంభమవుతుంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి ముందే ముగుస్తుంది.