Vice President:ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం

ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) పై 152 ఓట్ల ఆధిక్యంతో గెలిచి, భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా నిలిచారు. ఈ ఎన్నికలో విజయానికి 377 ఓట్లు అవసరం కాగా రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు సాధించారు. మొత్తం 781 మంది సభ్యులకు గాను 767 మంది పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్‌ఎస్ (BRS) , బీజేడీ (BJD ), శిరోమణి అకాళీదళ్ పార్టీలకు చెందిన 12 మంది సభ్యులతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 15 మంది సభ్యుల ఓట్లు చెల్లలేదు. ఎన్డీఏ కూటమి సభ్యులందరూ రాధాకృష్ణన్‌కు ఓటు వేయగా, విపక్షాలకు చెందిన సభ్యుల్లో 15 మందికి పైగా క్రాస్ ఓటింగ్ చేసి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలికారని స్పష్టమైంది. తెలుగు ఆత్మ గౌరవం పేరుతో ఇండియా కూటమి పక్షాలు తెలుగు ఎంపీల ఓట్లను చీల్చేందుకు చేసిన ప్రయత్నాలు దాదాపు విఫలం కాగా, డీఎంకేకు చెందిన పలువురు సభ్యులు తమిళ ఆత్మగౌరవానికి ప్రాధాన్యమిచ్చి రాధాకృష్ణన్‌కు ఓటు వేయడం గమనార్హం.