Modi: తమ స్వార్థం కోసం వక్ష్ చట్టాలను కాంగ్రెస్ మార్చేసింది: ప్రధాని మోదీ

వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం వక్ఫ్ నిబంధనలను మార్చివేసిందని ఆయన ఆరోపించారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పవిత్రమైన రాజ్యాంగాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటూ, ఓటు బ్యాంకు అనే వైరస్‌ను దేశంలో వ్యాపింపజేసిందంటూ కాంగ్రెస్‌ను మోదీ దుయ్యబట్టారు. ముస్లింలకు మద్దతుగా తాము నిలుస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్, అధికారంలో ఉన్నప్పుడు ఆ వర్గానికి చెందిన వారికి పార్టీలో ఉన్నత స్థానాలు ఎందుకు కల్పించలేదని ఆయన (PM Modi) ప్రశ్నించారు. కనీసం 50 శాతం ఎన్నికల టికెట్లను ముస్లిం అభ్యర్థులకు ఎందుకు రిజర్వ్ చేయలేదని నిలదీశారు.
హరియాణాలోని హిస్సార్‌లో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గమే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని పేర్కొంటూ, దేశ ప్రజల కోసం అంబేద్కర్ ఎంతో శ్రమించి రూపొందించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ కేవలం అధికారం దక్కించుకునే మార్గంగా పరిగణిస్తోందని విమర్శించారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితిని విధించి, అధికారాన్ని నిలుపుకోవడం కోసం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని దుయ్యబట్టారు. రాజ్యాంగ విలువల గురించి ఉపన్యాసాలు ఇచ్చే ప్రతిపక్ష నాయకులు వాటిని ఎన్నడూ ఆచరణలో పెట్టలేదని మోదీ (PM Modi) ఎద్దేవా చేశారు.