భారత ప్రధానిగా నరేంద్రమోదీ, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం

లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్న ఎన్‌డిఎ కూటమి నాయకునిగా ఎన్నికైన నరేంద్రమోదీ, భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు విదేశీ అతిధులు, విపక్ష నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీనటులు, ఇతరరంగాల ప్రముఖుల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. స్వతంత్ర భారత రాజకీయాల్లో అరుదైన ఘట్టంగా దీనిని పేర్కొనవచ్చు. దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం విశేషం. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన నాయకునిగా రికార్డులకెక్కారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 73 ఏళ్ల మోదీతో ప్రధానిగా ప్రమాణంచేయించారు. ఆయన దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అన్ని రంగాలకూ చెందిన అతిరథ మహారథుల సమక్షంలో కార్యక్రమం 155 నిమిషాల పాటు అత్యంత వేడుకగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీ చేత ప్రమాణం చేయించారు. ప్రధానిగా ఆయన పగ్గాలు చేపట్టడం ఇది వరుసగా మూడోసారి. నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ ప్రదానిగా మోదీ అరుదైన రికార్డును అందుకున్నారు. 2014లో తొలిసారి మోదీ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత 2019లోనూ రెండవసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఆయన, ఇప్పుడు మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మోదీ 3.0లో మొత్తంగా తనతోపాటు 72 మందితో కేంద్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 31 మంది కేబినెట్ హోదాలోను, 36 మంది సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐదుగురు స్వతంత్ర హోదా ( సహాయమంత్రులు) లో ఆయా శాఖలకు మంత్రులుగా వ్యవహరించనున్నారు. గత కేబినెట్‌లో కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించిన బీజేపీ అగ్రనేతలు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, జై శంకర్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులకు మరో అవకాశం లభించింది. అదేవిధంగా ఎంపీలుగా ఎన్నికైన కొందరు మాజీ ముఖ్యమంత్రులు కూడా మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. మొత్తంగా లోక్‌సభలో 240 ఎంపీల సంఖ్యాబలాన్ని కలిగిన బీజేపీ, కేబినెట్‌లోనూ ఎక్కువ బెర్తులు తనకే కేటాయించుకుంది. పదేళ్ల తర్వాత తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు తన కేబినెట్‌లో 11 బెర్తులను మోదీ కేటాయించడం జరిగింది. కొత్త కేబినెట్‌లో 27 మంది ఓబీసీలు, 11 మంది ఎస్సీలకు అవకాశం కల్పించగా, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాల నుంచి ఐదుగురు చొప్పున ప్రాతినిధ్యం దక్కింది. 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో, నిర్దిష్ట అభివృద్ధి ప్రాజెక్టుల ఎజెండాను నిర్దేశించుకున్న మోదీ, అందుకు అనుగుణంగా అనుభవజ్ఞులైన వారికి మంత్రివర్గంలో చోటిచ్చినట్లు స్పష్టమవుతోంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో 43 మంది మూడుసార్లు అంతకంటే ఎక్కువ సార్లు కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు. కాగా, మరో 23 మంది రాష్ట్రాల్లో మంత్రులుగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన వారు కావడం విశేషం. మిగతావారు తొలిసారి కేబినెట్‌లో అవకాశం దక్కించుకున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు ఎట్టకేలకు మళ్లీ మంత్రివర్గంలో చోటు దక్కింది. 2014లో నరేంద్ర మోదీ తొలి కేబినెట్‌లో జేపీ నడ్డా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 వరకు అదే పదవిలో కొనసాగారు. 2020 లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా స్థానంలో బాధ్యతలు చేపట్టారు. పార్టీ వ్యూహకర్తగా పనిచేశారు. 2022లో పార్టీ అధ్యక్ష పదవి ముగుస్తుందనగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకు పొడిగించారు. ఇప్పుడు మరోసారి నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి కొత్తవారు రానున్నారని ఈ పరిణామంతో స్పష్టమైంది.
కేంద్ర మంత్రివర్గంలో 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కింది. గోవా, అరుణాచల్ వంటి చిన్న రాష్ట్రాలను మినహాయిస్తే నలుగురు, అంతకంటే ఎక్కువ మంది లోక్‌సభ సభ్యులున్న ప్రతి రాష్ట్రం నుంచీ కనీసం ఒక్కరికి మంత్రివర్గంలో స్థానం లభించింది.
ఈ కార్యక్రమానికి విదేశీ నాయకులతోపాటు దేశీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఈ వేడుకలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, సుప్రీం సీజే డీవై చంద్రచూడ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్, జేడీయూ అధినేత నితీశ్ కుమార్, ఎన్‌సీపీ నేత అజిత్ పవార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, సినీ నటులు షారుక్ ఖాన్, రజనీకాంత్‌తోపాటు బీజేపీ అగ్రనేతలు మురళి మనోహర్ జోషి, కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, ఆధ్మాత్మిక వేత్త, చినజీయర్ స్వామి, పలు పీఠాలకు చెందిన అధిపతులు తరలివచ్చారు.
వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ, నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును చేరుకున్నారు. హ్యాట్రిక్ పీఎంగా భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సరసన చోటు దక్కించుకున్నారు. ఇదివరకు నెహ్రూ మినహా మరెవరూ ఈ అసాధారణ విజయాన్ని గౌరవాన్ని దక్కించుకోలేదు. 1952, 1957, 1962 ఎన్నికల్లో వరుసగా గెలిచిన నెహ్రూ దేశానికి వరుసగా మూడుసార్లు ప్రధాని మంత్రి అయ్యారు. కాగా, 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని పేద కుటుంబలో జన్మించిన మోదీ, రాజకీయాల్లో ఒక్కోమెట్టూ ఎక్కుతూ 2001లో మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి రాజకీయ సోపానంలో వెనక్కి తిరిగి చూడలేదు. గుజరాత్ మోడల్ అభివృద్ధి నినాదంతో 2014లో బీజేపీకి జాతీయ స్థాయిలో అఖండ విజయాన్ని సాధించిపెట్టారు. మొదటిసారిగా ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 2019లోనూ అదే జోరును కొనసాగించి అద్వితీయ విజయాన్ని కైవసం చేసుకుని రెండోసారి ప్రధాని అయ్యారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు బాధ్యతల్ని తన భుజానికెత్తుకున్న మోదీ, ఎన్డీయే కూటమిని విజయతీరానికి చేర్చారు. వాజ్‌పేయి తర్వాత మూడవసారి ప్రధాని అయిన రెండవ కాంగ్రెస్సేతర నాయకుడు మోదీ కావడం విశేషం. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెస్సేతర నేతగానూ మోదీ అరున రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త మంత్రివర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. వీరిలో బీజేపీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందినవారున్నారు. ప్రధానితో సహా 72 మందితో మంత్రివర్గం కొలువుదీరింది. వీరిలో 30 మంది కేబినెట్ హోదాలో ఉండగా వారిలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసిన మనోహర్ లాల్ ఖట్జర్, యూపీ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అసోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్, ఎన్డీయే పక్షాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు జితిన్ రామ్ మాంరీ(బీహార్), హెచ్‌డీ కుమారస్వామి (కర్నాటక) ఉన్నారు. ప్రధాని కాకముందు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.
మోదీ 2.0 మంత్రివర్గంలో పని చేసిన వారిలో స్మృతీ ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణే సహా ఏకంగా 37 మందికి ఈసారి కేబినెట్లో చాన్స్ దొరకలేదు. వీరిలో పలువురు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2.0 మంత్రివర్గంలోని 19 మంతి కేబినెట్ మంత్రులతో సహా మొత్తం 34 మంది తిరిగి చోటు దక్కించుకున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన ఎల్ మురుగన్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఓడినా చాన్స్ దక్కడం విశేషం. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. కొత్త మంత్రుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు చొప్పున 12 మంది రాజ్యసభ సభ్యులున్నారు. 58 మంది లోక్‌సభ సభ్యులు కాగా రవ్‌నీత్‌సింగ్ బిట్టూ, జార్జి కురియన్ ఏ సభలోనూ సభ్యలు కారు. వారు ఆర్నెల్లలోగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవాల్సి ఉంటుంది.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు నూతన మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కింది. తాజా మాజీ మంత్రివర్గంలో వాటికి ఒక్క కేబినెట్ హోదా, స్వతంత్ర హోదా మంత్రి పదవి కూడా లేదు. ఈసారి మాత్రం కుమారస్వామి (జేడీఎస్), మాంరిa (హెచ్‌ఏఎల్), లలన్‌సింగ్ (జేడీయూ), రామ్మోహన్ నాయుడు (టీడీపీ), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ`ఆర్‌వీ) రూపంలో ఏకంగా ఐదు కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి! ప్రతాప్‌రావ్ జాదవ్ (శివసేన), జయంత్ చౌదరి (ఆరెల్డీ)లకు స్వతంత్ర హోదా కూడిన పదవులు లభించాయి. 2.0 మంత్రివర్గంలో సహాయ మంత్రులైన అనుప్రియా పటేల్ (అప్నాదళ్`యూపీ), రామ్‌దాస్ అథవాలె (ఆర్‌పీఐఎ`మహారాష్ట్ర)లకు మళ్లీ చాన్సిచ్చారు. వారితో పాటు రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ), పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ)లకు సహాయ మంత్రి పదవులు దక్కాయి.