Mallikarjun Kharge: అంబేద్కర్‌పై గౌరవం మాటలకే పరిమితం.. బీజేపీ సర్కారుపై ఖర్గే ఫైర్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి మోదీ సర్కార్‌కు ఏమాత్రం లేదని, వారు కేవలం మాటలకే అంబేద్కర్ పట్ల గౌరవాన్ని పరిమితం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు అంబేద్కర్‌కు నిజమైన శత్రువులని ఆయన వ్యాఖ్యానించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ.. “మోదీ ప్రభుత్వం అంబేద్కర్ వారసత్వాన్ని అగౌరవ పరుస్తోంది. 1952 ఎన్నికలలో అంబేద్కర్ ఓటమికి ఎస్‌ఏ డాంగే, వీడీ సావర్కర్‌లు కారణమని ఆయనే స్వయంగా ఒక లేఖలో వెల్లడించారు” అని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన ఆవశ్యకతను ఖర్గే మరోసారి బలంగా నొక్కి చెప్పారు. అలాగే, ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. “రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పొందే హక్కును ప్రసాదించారు. ఏఐసీసీ సమావేశంలోనూ మేము ఈ సామాజిక న్యాయ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం. కేంద్రం ఇప్పటికీ 2011 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటోంది, కానీ 2021 జనాభా గణాంకాల ఊసే లేదు. సాధారణ జనాభా గణనతో పాటు కులాల వారీగా గణాంకాలు సేకరిస్తేనే సమాజంలోని ఏ వర్గం ఎంత మేరకు పురోగతి సాధించిందో స్పష్టంగా తెలుస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ కులగణన జరపాలని డిమాండ్ చేస్తోంది” అని ఖర్గే (Mallikarjun Kharge) వివరించారు.