Kunal Kamra: కునాల్ కామ్రాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు

స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా (Kunal Kamra)కు మద్రాస్ హైకోర్టు (Madras Highcourt) ఏప్రిల్ 7 వరకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)పై కామ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కామ్రాపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అరెస్టు నుండి రక్షణ కోరుతూ హైకోర్టును కామ్రా ఆశ్రయించారు. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. తన షోలో కామ్రా (Kunal Kamra) ఏ వ్యక్తినీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదని కామ్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, కేసులు మహారాష్ట్రలో నమోదైనప్పటికీ, కామ్రా తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వ్యక్తి కావడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఇటీవల ముంబయిలో నిర్వహించిన కామెడీ షోలో.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి ఓ పేరడీ పాటను కామ్రా (Kunal Kamra) ఆలపించడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనపై షిండే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కామ్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అనంతరం షిండే అనుచరులు కార్యక్రమం జరిగిన హోటల్‌పై దాడి చేశారు.