One Nation One Poll: జమిలి ఎన్నికలపై జేపీసీ గడువు పొడిగింపు.. లోక్‌సభ ఆమోదం

జమిలి ఎన్నికల (One Nation One Poll) కోసం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) గడువును పెంచడానికి లోక్‌సభ అంగీకారం తెలిపింది. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. వర్షాకాల సమావేశాల మొదటి రోజు వరకు జేపీసీ గడువును పెంచుతూ తీర్మానం చేశారు. జమిలి ఎన్నికల (One Nation One Poll) నిర్వహణకు కేంద్రం ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది రాజ్యాంగానికి భంగం కలిగించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, బిల్లును జేపీసీకి పంపాలని డిమాండ్ చేశాయి. దీంతో 39 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ (One Nation One Poll) కమిటీలో నుంచి 27 మంది లోక్‌సభ ఎంపీలు, 12 మంది రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. కమిటీ కాలపరిమితి మే 4న ముగియాల్సి ఉండగా, బిల్లుపై సమగ్రంగా అధ్యయనం పూర్తికాకపోవడంతో గడువు పెంచాలని నిర్ణయించారు. కమిటీ ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయ నిపుణులు హరీశ్ సాల్వే, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి.షాలను సంప్రదించి, వారి అభిప్రాయాలను పేకరించింది.